Fri Dec 05 2025 13:23:37 GMT+0000 (Coordinated Universal Time)
Tiruamala : తిరుమలలో మళ్లీ పెరిగిన భక్తుల రద్దీ.. శుక్రవారం దర్శనం కోసం?
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. శుక్రవారం కావడంతో తిరిగి భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు

తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. శుక్రవారం కావడంతో తిరిగి భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. తిరుమలకు వచ్చే ఘాట్ రోడ్డులో ఉదయం నుంచి వాహనాల రద్దీ నెలకొంది. అలిపిరి టోల్ గేట్ నుంచి వాహనాల తనిఖీ సమయం వద్ద మొదలయిన ఆలస్యం చూస్తే ఇక మూడు రోజుల పాటు తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
కిక్కిరిసిన తిరుమల వీధులు...
గత నెలన్నరోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నిన్న గురువారం మాత్రం కేవలం దర్శనానికి ఎనిమిది గంటల సమయం మాత్రమే పట్టింది. నిన్న భక్తుల రద్దీ సాధారణంగా కనిపించినా నేటి ఉదయం నుంచి తిరిగి భక్తుల రద్దీ మొదలయింది. వీధులన్నీ గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. భక్తుల అధిక సంఖ్యలో తరలి వస్తుండటంతో వాహనాల పార్కింగ్ కూడా కష్టంగా మారింది. అప్పటికీ పోలీసులు ట్రాఫిక్ ను ఎక్కడక్కడ నియంత్రిస్తూ చర్యలు చేపడుతున్నా పలు చోట్ల జామ్ అవుతుంది.
ఇరవై ఆరు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై ఆరు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 64,879 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో23,960 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.09 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

