Fri Dec 05 2025 21:56:05 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు దర్శనానికి వచ్చే భక్తులకు తాజా కబురు ఏంటంటే?
తిరులమలలో భక్తుల రద్దీ ఈరోజు కూడా సాధారణంగానే ఉంది. బుధవారం కావడంతో భక్తుల రద్దీ పెద్దగా లేదనే చెప్పాలి

తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు కూడా సాధారణంగానే ఉంది. బుధవారం కావడంతో భక్తుల రద్దీ పెద్దగా లేదనే చెప్పాలి. గత ఆరు రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ అత్యంత తక్కువగా ఉంటుంది. ప్రధాన కారణం వరసగా పండగలు రావడంతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో భక్తులు తిరుమలకు వచ్చేందుకు కొంత వెనకడుగు వేస్తున్నారు. భారీ వర్షాలకు తిరుమలకు వెళ్లి ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తుతాయని భావించి ఎక్కువ మంది తమ తిరుమల పర్యటనను వాయిదా వేసుకుంటున్నారు.
ఆరు రోజుల నుంచి...
అయితే గత ఆరు రోజుల నుంచి పోల్చి చూస్తే నేడు తిరుమలలో భక్తుల రద్దీ కొంత పరవాలేదనిపిస్తుంది. ఈ నెల 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఉండటంతో ఆలయాన్ని మూసివేయనున్నారు. వీఐపీ సిఫార్సు లేఖలను కూడా అనుమతించబోమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. ఇదే సమయంలో ముందుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకున్న వారితో పాటు కాలినడకన వచ్చే భక్తులు, ఆంధ్రప్రదేశ్, పొరుగున ఉన్న తమిళనాడు నుంచి ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.
పదకొండు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదకొండు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 64,925 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,338 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.90 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

