Fri Dec 05 2025 14:30:58 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో పెరిగిన రద్దీ .. దర్శనానికి ఎంత సమయమంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువయింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఈరోజు ఎక్కువగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువయింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఈరోజు ఎక్కువగా ఉంది. దీనికి తోడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. అక్టోబరు 2వ తేదీ వరకూ శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీనికి తోడు దసరా సెలవులు తోడవ్వడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. పెరటాసి మాసం వస్తుండటంతో తమిళనాడు నుంచి భక్తుల రాక ఎక్కువగా ఉంది.
భక్తులు ఇబ్బందులు పడకుండా...
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యేందుకు పెద్ద సంఖ్యలో తిరుమలకు భక్తులు చేరుకుంటున్నారు. ఈరోజు తిరుమలలోని అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈరోజు ఉదయం నరసింహ అవతారంలో సింహ వాహనంపై స్వామి వారు భక్తులకు మాడ వీధుల్లో దర్శనమిచ్చారు. అలాగే ఈరోజు రాత్రి ఏడు గంటలకు శ్రీకృష్ణుని అవతారంలో ముత్యపు పందిరి వాహనంపై మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
పదహారు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదహారు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ఈరోజు ఉదయం ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదహారు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 67,388 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,998 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 1.74 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

