Fri Dec 05 2025 22:11:18 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : శనివారం తిరుమలలో నేటి రద్దీని చూసిన వారికి ఎవరికైనా?
తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు.

తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శనివారం శ్రీ వెంకటేశ్వరస్వామికి అత్యంత ఇష్టమైన రోజు కావడంతో ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. మరొక వైపు పరీక్ష ఫలితాలు వెల్లడి కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు కనీస సదుపాయలను కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
అలిపిరి నుంచే...
తిరుమలలో రద్దీ ఉన్నదీ? లేనిదీ మనకు అలిపిరి గేటు వద్దనే తెలుస్తుంది. ఇక్కడ ఎక్కువ వాహనాలు గంటల తరబడి నిలిచి పోయి ఉంటే తిరుమలలో భక్తులు కూడా అధికంగా ఉంటారని అనుకోవాలి. శుక్రవారమే కొందరు భక్తులు తిరుమలకు చేరుకుని శనివారం నాటి దర్శనం పూర్తయ్యేలా ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. వారితో పాటు కాలినడకన వచ్చే భక్తులు, ఎస్.ఎస్.డి. టోకెన్లు రోజు వారీ జారీ చేయడంతో వారితో పాటు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన వారు కూడా శనివారమే అధికంగా వస్తుంటారు.
పన్నెండు గంటల సమయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై ఆరు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వేసవి రద్దీ కూడా తోడవ్వడంతో టైమ్ స్లాట్ భక్తులకు ఐదు గంటలకు దర్శన సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 64,536 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,612 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.37 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

