Fri Dec 05 2025 14:58:59 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది.

తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. పాక్ - భారత్ సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలు తొలిగిపోవడంతో పాటు వేసవి రద్దీ నేటి నుంచి మళ్లీ మొదలయింది. వేసవి రద్దీకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇందుకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు చేశాయి. ఇప్పటికే సిఫార్సు లేఖలను రద్దు చేసిన టీటీడీ జులై 15వ తేదీ వరకూ ఎలాంటి లేఖలను స్వీకరించమని తేల్చి చెప్పింది. సామాన్య భక్తులకు సులువుగా దర్శనం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లను చేసింది.
వేసవి రద్దీతో...
తిరుమలకు సీజన్ తో నిమిత్తం లేకుండా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా శుక్ర, శని, ఆదివారాలు, సెలవు దినాల్లో ఎక్కువ రద్దీ ఉంటుంది. ఇక వేసవిలో రద్దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఇక పరీక్షలలో ఉత్తీర్ణులయిన వారితో పాటు విద్యాసంస్థలకు సెలవులు కావడంతో సహజంగానే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తుల రద్దీతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. వసతి గదుల కేటాయింపుల్లోనూ మార్పులు చేశారు.
ఇరవై ఒక్క కంపార్ట్ మెంట్లలో...
నేడు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై ఒక్క కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 85,078 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 35,791 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.67 కోట్ల రూపాయలు సమర్పించినట్లు అధికారులు తెలిపారు.
Next Story

