Fri Dec 05 2025 19:09:12 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో ఏమాత్రం తగ్గని భక్తుల రద్దీ.. దర్శనానికి నేడు ఎంత సమయం అంటే?
తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు

తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి పోల్చి చూస్తే కొంత రద్దీ తక్కువగానే ఉందని చెప్పవచ్చు. గత రెండు రోజులుగా అన్ని కంపార్ట్ మెంట్లు నిండి భక్తులు బయట వరకూ నిల్చున్నారు. క్యూలైన్లు బయట వరకూ విస్తరించడంతో గంటల తరబడి స్వామి వారి దర్శనం కోసం వేచి చూడాల్సి వచ్చింది. అయితే నేడు కూడా కొన్ని కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
పెళ్లిళ్ల సీజన్.. పరీక్షల ఫలితాలు...
పెళ్లిళ్ల సీజన్ తో పాటు శుభకార్యాలు ఉండటంతో వాటిని ముగించుకుని ఎక్కువ మంది భక్తులు తిరుమలకు మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్నారు. ఇదే సమయంలో పరీక్ష ఫలితాలు కూడా వెల్లడి అవుతుండటంతో విద్యార్థులు కూడా అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. దీంతో ఇక రెండు నెలల పాటు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదమూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు నేడు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో కి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,543 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,346 మంది భక్తుల తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.22 వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

