Fri Dec 05 2025 21:07:24 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : ఈరోజు తిరుమలకు వెళుతున్నారా... అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందే
తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ అధికంగానే ఉంది

తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ అధికంగానే ఉంది. గత రెండు రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు అసౌర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్ ల దగ్గర నుంచి కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులకు అవరమైన అన్న ప్రసాదాలను, మజ్జిగ, మంచినీటిని పంపిణీ చేస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు దాహార్తికి ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
వేసవి తీవ్రతను...
దీంతో పాటు కంపార్ట్ మెంట్లలో వేడిగాలులు తగలకుండా ఎయిర్ కూలర్ లను ఏర్పాటు చేశారు. భక్తులు కంపార్ట్ మెంట్ లో కూర్చున్నప్పుడు కూల్ గా ఉండే వాతావరణాన్ని కల్పించారు. ఇక ప్రధాన ద్వారం నుంచి బయటకు వచ్చే సమయంలో కాళ్లు ఎండకు మండి పోకుండా కార్పెట్లు వేశారు. వాటిపై నీళ్లుచల్లడంతో కొంత చల్లదనం కలుగుతుందని భక్తులు చెబుతున్నారు. ముందుగా బుక్ చేసుకున్న వారితో పాటు ఎస్.ఎస్.డి. టోకెన్లు తీసుకుని రోజూ అధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దర్శనం వీలయినంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని తొమ్మిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటలకుపైగానే సమయంపడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 67,127 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,910 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.47 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
Next Story

