Sat Jul 12 2025 13:47:14 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేడు తిరుమల క్యూ లైన్ లోకి వెళ్తే బయటకు వచ్చేసరికి ఎంత టైమ్ పడుతుందో తెలిస్తే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. కంపార్ట్ మెంట్లన్నీ ఫుల్లయిపోయాయి. భక్తులు ఎక్కడ చూసినా తిరుమల వీధుల్లో కనిపిస్తున్నారు. వరసగా సెలవులు రావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. వేసవి సెలవులు ముగిసినప్పటికీ తిరుమలకు భక్తుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు బక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్ారు.
సీజన్ తో సంబంధం లేకుండా...
తిరుమలకు ఇప్పుడు సీజన్ తో సంబంధం లేకుండా రద్దీ కొనసాగుతుంది. ఒకప్పుడు విద్యాసంస్థలు ప్రారంభమయిన తర్వాత భక్తుల రద్దీ తక్కువగా ఉండేది. అంటే జూన్ రెండో వారం నుంచి భక్తుల రాక తగ్గుతుండేది. వేసవితో పాటు శుక్ర, శని, ఆదివారాలు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ మేరకు అంచనా వేసి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ మే 15వ తేదీ నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని వేల సంఖ్యలో తిరుమలకు ప్రతి రోజూ భక్తులు వస్తూనే ఉన్నారని అధికారులు చెబుతున్నారు.
తెల్లవారు జామునుంచే...
తెల్లవారు జామునుంచే భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి బయట శిలా తోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఏడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటలకుపైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 90,087 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 41,891 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమలకు రికార్డు స్థాయిలో 4.30 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story