Fri Dec 05 2025 16:14:53 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ... వసతి గృహాలు దొరకడమూ కష్టమే
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. మామూలుగా శుక్ర, శని, ఆదివారాలు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే గత నెల రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమలకు వచ్చే వారిసంఖ్య ఎక్కువ కావడంతో వసతి గృహాలు లభ్యం కావడం కష్టంగా మారింది. చాలా సేపు వెయిట్ చేస్తే తప్ప వసతి గృహాలు లభ్యం కావడం లేదు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఒక్కరోజు మాత్రమే వసతి గృహం కేటాయింపుకు పరిమితం చేశారు.
నెల రోజుల నుంచి...
గత కొన్నాళ్లుగా భక్తుల రద్దీ తిరుమలలో ఎక్కువగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు. గత కొద్ది రోజులుగా కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూ లైన్లన్నీ బయట వరకూ విస్తరించడంతో క్యూ లైన్లలో గంటల తరబడి వేచి చూస్తున్న భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీటిని పంపిణీ చేస్తున్నారు. సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట ఏటీజీహెచ్ వరకూ క్యూ లైన్ విస్తరించింది. అంటే దాదాపు రెండు నుంచి మూడు కిలోమీటర్ల వరకూ భక్తుల క్యూ లైన్ ఉంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు పదహారు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 69,609 మంది భక్తుల దర్శించుకున్నారు. వీరిలో 33,144 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.11 కోట్ల రూపాయలు వచ్చింది.
Next Story

