Fri Dec 05 2025 19:37:40 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఇంత ఎక్కువగా అంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. సాధారణంగా శుక్ర, శని, ఆదివారాలు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ మూడు రోజులు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటారు. కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు మజ్జిగ, మంచినీటిని శ్రీవారి సేవకులు అందచేస్తారు.
వసంతోత్సవాలు....
తిరుమలలో నేడు శ్రీవారి వసంతోత్సవాలు జరుగుతుండటంతో ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. భక్తులు ఎంత మంది వచ్చినా దర్శనం త్వరగా పూర్తయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నభక్తులు ఎక్కువ సేపు వేచి ఉండకుండా వారికి దర్శనం త్వరగా పూర్తయ్యేలా అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మరొక వైపు ఎండ వేడిమి నుంచి తట్టుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని అన్ని 31 కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఉచిత దర్శనానికి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు స్వామి వారి దర్శనం ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటలకు పైగా సమయం పడుతుంది. నిన్న 57,652 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్నతిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.04 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
Next Story

