Sat Dec 06 2025 01:00:15 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి...క్యూ లైన్ ఎంత పొడవు ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వేసవికి ముందే తిరుమలలో భక్తుల తాకిడి పెరిగింది. బయట వరకూ క్యూ లైన్లు నిండిపోతున్నాయి. తిరుమలలో ఎక్కడ చూసినా భక్తులు దర్శనమిస్తున్నారు. ఎక్కడ చూసినా గోవింద నామస్మరణలతో తిరుమల వీధులన్నీ మారుమోగుమోగుతున్నాయి. ఇదే సమయంలో తిరుమలలో ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
వేసవిలో రద్దీ...
ఇప్పటికే జులై నెల దర్శనం టిక్కెట్లు కూడా ఆన్ లైన్ లో విడుదల అవుతుండటంతో అవి కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. భక్తులు ఎక్కువగా మంచినీటి కోసం ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ తిరుమలలో జలప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. చల్లని మంచి నీటిని అందిస్తున్నారు. అలాగే క్యూ లైన్ లో ఉన్న వారికి మజ్జిగ, మంచినీళ్లు, అన్న ప్రసాదాలను కూడా శ్రీవారి సేవకులు సరఫరా చేస్తున్నారు. జూన్ నెలాఖరు వరకూ రద్దీ ఇలాగే ఉంటుందని అంచనా వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ మేరకు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని అన్ని కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులు కంపార్ట్ మెంట్లు నిండిపోయి బయట కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ క్యూ లైన్ విస్తరించి ఉంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించి వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 78,821 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 33,568 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.36 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

