Fri Dec 05 2025 22:09:05 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala: తిరుమలకు వచ్చే వారికి అలెర్ట్... ఈరోజు రష్ ఎలా ఉందో తెలుసా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శనివారం వెంకటేశ్వరస్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావడంతో ఎక్కువ మంది శనివారం నాడు ఏడుకొండలవాడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవాలని భావిస్తుంటారు. వేసవి సెలవులు పూర్తయి విద్యాసంస్థలు ప్రారంభమయినప్పటికీ ఇంకా తిరుమలలో రద్దీ ఏమాత్రం తగ్గలేదు. వివిధ పరీక్ష ఫలితాలు రావడంతో ఉత్తీర్ణులయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, శుభకార్యాలు చేసుకున్న వారితో తిరుమల కిటకిట లాడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
నెల రోజుల నుంచి...
తిరుమలలో గతంలో ఎన్నడూ లేనంత రద్దీ గత నెల రోజుల నుంచి ఎక్కువగా ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులతో తిరుమల కొండలు గోవింద నామస్మరణలతో మారు మోగిపోతున్నాయి. మరోవైపు వేసవి రద్దీని ముందుగానే ఊహించిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు వర్షాలు ఇంకా మొదలు కాకపోవడంతో ఎక్కువగా భక్తులు తిరుమలకు వచ్చి తమ కోర్కెలను తీర్చాంటూ ఏడుకొండల వాడిని కోరుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. వెలుపల శిలాతోరణం వరకూ భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 18గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల తెలిపారు.టైమ్ స్లాట్ దర్శనం ఐదు గంటలకు పైగానే పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న వేంకటేశ్వరస్వామిని 75,096 మంది దర్శించుకోగా, 36,262 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.93 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
Next Story

