Fri Dec 05 2025 19:56:49 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు శనివారం పోటెత్తిన భక్తులు.. ఈరోజు దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంది. భక్తులతో అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి కిలోమీటర్ల వరకూ క్యూ లైన్ విస్తరించింది. తిరుమల కొండపైకి వచ్చే వాహనాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. తిరుమలలో వసతి గృహాలు లభించని వారు తిరుపతిలో రాత్రి బస చేసి ఉదయాన్నే తిరుమలకు చేరుకుంటుండటంతో తెల్లవారు జాము నుంచి తిరుమల కొండ ఎక్కే వాహనాలతో ఘాట్ రోడ్లు రద్దీగా మారాయి. ప్రయాణం చాలా నెమ్మదిగా సాగుతుంది. తిరుమలలో కూడా వాహనాల పార్కింగ్ కు కష్టంగా మారింది.
వచ్చిన వారందరికీ...
తిరుమలలో భక్తులు పోటెత్తడంతో భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. కొండపైకి వచ్చిన వారందరికీ దర్శనం కల్పిస్తామని అధికారులు చెప్పారు. భక్తులు కూడా టీటీడీ సిబ్బందితో సహకరించాలని కోరారు. సహజంగా శని, ఆదివారాలు తిరుమలకు ఎక్కువగా దర్శనానికి వస్తుంటారు. అందుకే భక్తులు ఎక్కువ మంది వస్తారని భావించి ఈ మూడురోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం సంప్రదాయంగా వస్తుంది.
ఇరవై నాలుగు గంటల దర్శనం....
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బయట శిలా తోరణం వరకూ క్యూ లైన్ విస్తరించింది. దాదాపు రెండు కిలోమీటర్లకు పైగానే బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఏడు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 76,181 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33,874 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.88 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

