Thu Mar 20 2025 01:14:44 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా సరే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా సరే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నిన్న అర్ధరాత్రి పన్నెండు గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలు ముగిశాయి. దాదాపు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు జరిగాయి. ఈ నెల 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టోకెన్లు జారీ చేశారు. లక్షలాది మంది ఈసారి టోకెన్లను తీసుకుని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకున్నారు. తమ మొక్కులు తీర్చుకున్నారు.
6.83 లక్షల మందికి...
వైకుంఠం ద్వార దర్శనాలకు ఆరు లక్షల ఎనభై మూడు వేల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మళ్లీ డిసెంబరు 30వ తేదీన వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని అధికారులు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చిన భక్తులు సులువుగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామి వారిని చూసేందుకు అవకాశం కల్పించగలిగామని టీటీడీ అధికారులు చెప్పారు. భక్తులు కూడా అత్యధికంగా గతంలో ఎన్నడూ లేని విధంగా వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.
నేటి నుంచి సర్వ దర్శనాలు...
అర్ధరాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ముగియడంతో టీటీడీ అర్చకులు ఆ ద్వారాలను మూసివేశారు. నేటి నుంచి సర్వ దర్శనాలు ప్రారంభం కానున్నాయి. అయితే నేడు వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేశారు. సిఫార్సు లేఖలను కూడా స్వీకరించమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అయినా భక్తులు అధిక సంఖ్యలో రావడంతో దర్శనానికి గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 70,826 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,625 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం3.68 కోట్ల రూపాయలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Next Story