Sat Dec 13 2025 22:24:21 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ దర్శనానికి ఎంత సమయం అంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. గత నెల రోజులకు పైగానే తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మే 15వ తేదీ నుంచి సిఫార్సు లేఖలను తిరిగి అనుమతించిన తర్వాత తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిందంటున్నారు. అంతకు ముందు రద్దీ తక్కువగా ఉండటంతో జులై ఒకటో తేదీ వరకూ సిఫార్సు లేఖలను స్వీకరించబోమని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించడంతో భక్తుల రద్దీ పలచనగా ఉంది. దీంతో తిరిగి సిఫార్సు లేఖలను అనుమతించడం ప్రారంభించిన అనంతరం భక్తుల రద్దీ పెరిగింది.
సేవా టిక్కెట్ల విడుదల షెడ్యూల్...
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, దర్శన టికెట్లు విడుదలకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధం చేసింది. ఆగస్టు నెలకు సంబంధించిన పరకామణి,నవనీత,గ్రూప్ సూపర్వైజర్ల సేవల నమోదుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెలకు సంబంధించి ఆన్లైన్ కోటా విడుదల చేయనుంది. రేపు ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవల ఎలక్ట్రానిక్ డిప్.. ఈనెల 20న ఉదయం 10 వరకు నమోదుకు అవకాశం కల్పించింది. ఈనెల 21న ఉదయం10 గంలకు మరిన్ని ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనుంది. ఈనెల 21 మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల చేయనుంది. ఈ నెల 23న ఉదయం10 గం.కు అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల చేయనుంది. ఈ నెల 23న ఉదయం11 గం.కు శ్రీవాణి టికెట్లు విడుదల చేయనుంది.
క్యూ లైన్లు నిండి...
మధ్యాహ్నం 3 గం.కు వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు విడుదల చేస్తామని, ఈనెల 24న ఉదయం10 గం.కు రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.12 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

