Fri Dec 05 2025 09:51:49 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. నేడు దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. గత కొద్ది నెలల నుంచి తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. వారంతో సంబంధం లేకుండా భక్తులు తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. తిరుమలకు చేరుకునే భక్తుల సంఖ్య ప్రతి రోజూ పెరగడంతో ఆదాయం కూడా తిరుమల శ్రీవారికి భారీగా పెరుగుతుంది. గత మూడు నెలల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉందని, ఆదాయం కూడా బాగా వస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
తగ్గని భక్తుల రద్దీ...
మే 15వ తేదీ నుంచి భక్తుల రాక ఊపందుకుంది. పరీక్ష ఫలితాలు విడుదల కావడంతో పాటు వేసవి సెలవులు ముగుస్తాయని భావించి మే నెలలో అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. జూన్ నెలలో కూడా దాదాపు 120 కోట్ల రూపాయల హుండీ ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు. జులై నెలలోనూ అదే స్థాయిలో భక్తుల రద్దీ కొనసాగింది. కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి బయట వరకూ క్యూ లైన్ నిండిపోవడతో సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా, సులువుగా దర్శనం అయ్యేలా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆగస్టు నెలలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది.
30 కంపార్ట్ మెంట్లలో....
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 30 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 76,033 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,905 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.30 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

