Fri Dec 05 2025 14:59:18 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. గత ఇరవై రోజుల నుంచి తిరుమలకు పెద్ద సంఖ్యలో బక్తులు తరలి వస్తున్నారు. వేసవి సెలవులు ముగియనుండటంతో పరీక్షల్లో ఉత్తీర్ణులయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు పెళ్లిళ్లు, శుభకార్యాలు చేసుకుని ఏడుకొండల వాడి చెంతకు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. గత ఇరవై రోజుల నుంచి కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి బయట వరకూ క్యూ లైన్లు విస్తరించి ఉన్నాయి. అయితే సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
అన్ని చోట్ల రద్దీ..
మరోవైపు సిఫార్సు లేఖలు కూడా అనుమతిస్తుండటంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలి వస్తున్నారు. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. ఒకరోజుకు మించి వసతి గృహాన్ని కేటాయించడం లేదు. ఇక లడ్డూ ప్రసాదాల కౌంటర్ల వద్ద, అన్న ప్రసాదం కేంద్రం వద్ద అధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో అందుకు తగినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తలనీలాలను సమర్పించే ప్రాంతంలో కూడా రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్ లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదహారు గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 78,631 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,247 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.29 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

