Mon Jun 23 2025 03:42:50 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో ఎక్కడ చూసినా భక్త జనసందోహమే... క్యూ లైన్ ఎంత పొడవంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం అయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం అయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. వేసవి సెలవులు ముగియడానికి మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉండటంతో భక్తుల రద్దీ మరో వారం పాటు కొనసాగే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఎక్కడ చూసినా తిరుమలలో గోవింద నామస్మరణలే వినిపిస్తున్నాయి. అలిపిరి వాహనాల తనిఖీ కేంద్రం నుంచి క్యూ లైన్లు, లడ్డూ కౌంటర్లు, అన్న ప్రసాదం వితరణ కేంద్రం వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు.
గత కొన్ని రోజులుగా...
గత ఇరవై రోజుల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు గంటల సమయం దర్శనానికి పడుతుంది. ఎక్కువ సేపు క్యూ లైన్ లలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కాలినడకన వచ్చే భక్తులతో పాటు ఎస్.ఎస్.డి. టోకెన్లు కూడా జారీ చేస్తుండటంతో భక్తుల రద్దీ తగ్గడం లేదు. ఇక ఎలాగూ ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు సయితం తిరుమలకు చేరుకుని ఏడుకొండలవాడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు వస్తుండటంతో వారంతో సంబంధం లేకుండా రద్దీ పెరిగింది.
పద్దెనిమిది గంటలు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయి బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. దాదాపు రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేర బయట క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం దాదాపు పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు నాలుగు నుంచి ఐదు గంటల సయమం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 84,258 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33,502 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.90 కోట్లు సమకూరిందని అధికారులు తెలిపారు.
Next Story