Fri Dec 05 2025 14:03:51 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : మంగళవారం కూడా తిరుమలలో భక్తుల క్యూ లైన్ చూశారా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారమయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారమయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. పాఠశాలలు ప్రారంభమయినా వేసవి రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. బస్సులు, రైళ్లు, ప్రయివేటు వాహనాల్లో తిరుమలకు భక్తులు చేరుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జూన్ నెల మూడో వారంలో కూడా ఇలాంటి రద్దీ కొనసాగడం విశేషమేనని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. తిరుమలకు వచ్చి శ్రీనివాసుడి చెంత తమ మొక్కులు తీర్చుకునేందుకు ఎక్కువ మంది భక్తులు తరలి వస్తున్నారు.
వీధులన్నీ కిటకిట...
దీంతో తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. హోటళ్లలో రద్దీ పెరిగింది. గత నెల రోజుల నుంచి భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో అవసరమైన చర్యలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల ప్రారంభించారు. ప్రధానంగా క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తులకు అవసరమైన అన్నప్రసాదాలను అందిస్తున్నారు. వైద్యం కోసం అత్యవసర ఏర్పాట్లను కూడా చేశారు. దర్శనం సులువుగా, వీలయినంత త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
బయట వరకూ క్యూ లైన్...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఏటీజీ హెచ్ వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. అంటే దాదాపు కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ లైను ఉంటుంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 84,681 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.43 కోట్ల రూపాయలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Next Story

