Fri Dec 05 2025 15:10:00 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో ఏమాత్రం తగ్గని భక్తుల రద్దీ... గురువారమయినా క్యూ లైన్ పొడవు?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నేటితో వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్నప్పటికీ భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. తిరుమలకు గత నెల రోజుల నుంచి భక్తుల రద్దీ కొనసాగుతుంది. మే 15వ తేదీన సిఫార్సు లేఖలను తిరిగి స్వీకరిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకున్న తర్వాత భక్తుల రద్దీ అమాంతం పెరిగింది. అప్పటి నుంచి కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోతున్నాయి. తిరుమలకు భక్తుల రాక ఎక్కువయింది.
గంటల తరబడి క్యూ లైన్లలో...
పెళ్లిళ్ల సీజన్ కూడా ముగియనుండటంతో శుభకార్యాలు చేసుకున్న వారు తిరుమలకు వచ్చి ఏడుకొండల వాడి వద్ద భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. కంపార్ట్ మెంట్లన్నీ నిండి క్యూ లైన్లు బయట వరకూ విస్తరించడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మంచినీరు, మజ్జిగ, అన్నప్రసాదాలను క్యూ లైన్లలో సరఫరా చేస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లలో భక్తులు వేచి ఉండాల్సి రావడంతో వైద్యులను కూడా అత్యవసర సేవల నిమిత్తం ఏర్పాటు చేశారు.
పదిహేను గంటలు...
ఈరోజు తిరుమలలోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 79,296 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.49 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

