Sat Dec 13 2025 22:32:19 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala: తిరుమలకు నేడు వెళ్లే భక్తులకు అలెర్ట్
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. సహజంగా వారంలో శుక్రవారం నుంచి భక్తుల రాక మొదలై ఆదివారం వరకూ కొనసాగుతుంది. అందుకే శుక్ర, శని,ఆదివారాలు ఎక్కువ మంది భక్తులు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారని భావించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో వారాలతో సంబంధం లేకుండా తమ మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
కార్తీక మాసంలో...
పెళ్లిళ్లు, శుభకార్యాలు కూడా జరుగుతుండంతో మంచి రోజులు కావడంతో పాటు కార్తీక మాసంలో తిరుమల వెంకన్నను దర్శించుకోవడం మంచిదని భావిస్తారు. ఇక కార్తీక మాసంలో తీర్థయాత్రలు కూడా ఎక్కువగా చేస్తుంటారు. దేశంలో నలుమూలల నుంచి అనేక ఆలయాలను సందర్శించే పర్యటనలో భాగంగా తిరుమలను కూడా ఒకటి చేర్చుకుంటారు.అందుకే ఈ నెలలో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ఉదయం ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 61,718 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,937 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.52 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

