Fri Dec 05 2025 15:59:00 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ ఇంతగా పెరగడానికి కారణాలివేనా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది. గత కొద్ది రోజుల నుంచి తిరుమల భక్తులతో కిటకిట లాడుతుంది. తిరుమల వీధులన్నీ గోవింద నామస్మరణలతో మారుమోగుతున్నాయి. మాడ వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట రెండు నుంచి మూడు కిలోమీటర్ల వరకూ భక్తుల క్యూ లైన్ శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తుండటం కనిపిస్తుంది. అలిపిరి టోల్ గేట్ నుంచి వాహనాల రద్దీ కూడా అధికంగా ఉండటంతో ఘాట్ రోడ్డులో నిదానంగా ప్రయాణం చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచిస్తున్నారు.
నాలుగు నెలల నుంచి...
తిరుమలకు శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కేవలం ఈ మూడు రోజుల్లో మాత్రమే కాకుండా వారమంతా రద్దీ అధికంగా ఉంది. ఆ మాట కొస్తే ఈ ఏడాది మే 15వ తేదీన ప్రారంభమయిన భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. అయితే తిరుమలకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడకుండా అన్నిచర్యలు తీసుకుంటున్నామని, క్యూ లైన్ లలో వేచి ఉన్న వారికి అన్నప్రసాదాలను, మజ్జిగ, పాలు వంటివి పంపిణీ చేస్తున్నామని, వీలయినంత త్వరగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ క్యూ లైన్ విస్తరించి ఉంది. అంటే దాదాపు కిలోమీటరు పొడువుగా క్యూలైన్ బయటకు ఉంది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 82,149 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 36,578 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.85 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

