Fri Dec 05 2025 23:12:27 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి ఎంత సమయం అంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ బాగా పెరిగింది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ బాగా పెరిగింది. రేపు సంపూర్ణ చంద్రగ్రహణం కావడంతో ఆలయాన్ని దాదాపు పన్నెండు గంటల పాటు మూసివేయనున్నారు. పదిహేను గంటల పాటు దర్శనాలకు నిలిపివేయనున్నారు. అందుకే నేడు అధిక సంఖ్యలో తిరుమలకు భక్తులు చేరుకున్నారు. తిరుమలకు అత్యధిక సంఖ్యలో భక్తులు చేరుకోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలిపిరి టోల్ గేట్ నుంచి తిరుమలకు వెళ్లే భక్తులతో వాహనాల నిలిచిపోయాయి. ఇక్కడ వాహనాల తనిఖీ కోసం ఆగాయి.
రేపు ఆలయం మూసివేత...
రేపు సంపూర్ణ చంద్రగ్రహణం కావడంతో తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. రేపు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఎల్లండి వేకువ జాము మూడు గంటల వరకూ ఆలయం తలుపులు తెరుచుకోవు. అలాగే రేపు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఎల్లుండి ఉదయం ఆరు గంటల వరకూ స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించరు. రేపు శ్రీవాణి ఆన్ లైన్ లో టిక్కెట్లు ఉన్న భక్తులకు మధ్యాహ్నం 1.30 గంటలకు దర్శనానికి అనుమతిస్తారు. రేపు వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలను స్వీకరించడం లేదని, ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఇరవై నాలుగు గంటలు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయారు. బయట శిలా తోరణం వరకూ క్యూ లైన్ విస్తరించింది. ఉదయం సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఎనిమిది గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 69,531 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,439 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.49 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

