Fri Dec 05 2025 12:58:43 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : ఈరోజు తిరుమలకు వెళుతున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈరోజు ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలి వచ్చారు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈరోజు ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలి వచ్చారు. దీంతో తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. మాడ వీధులన్నీ గోవింద నామ స్మరణలతో మారుమోగిపోతున్నాయి. అలిపిరి టోల్ గేట్ నుంచి ప్రారంభమయిన రద్దీ స్వామి వారి దర్శనం వరకూ కొనసాగుతుంది. ఇక తిరుమల ఘాట్ రోడ్డులోనూ అధిక సంఖ్యలో వాహనాలు వస్తుండటంతో నెమ్మదిగా రావాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కోరుతున్నారు.
ఎందరు వచ్చినా...
గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమలకు గత మూడు నెలల నుంచి భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. పెరిగిన భక్తుల సంఖ్యకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. సామాన్య భక్తులకు సులువుగా దర్శనం కలిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్యూ లైన్ లో ఉన్న వారికి అవసరమైన అన్న ప్రసాదాలను, మజ్జిగ, పాలు, మంచినీటిని పంపిణీ చేస్తున్నారు. ఎంత మంది భక్తులు వచ్చినా ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి స్వామి వారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 84,404 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 34,930 మంది భక్తుల తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.06 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

