Fri Dec 05 2025 10:28:55 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు వెళ్లేవారు జాగ్రత్త... రోజు పాటు క్యూ లైన్ లో ఉండాల్సిందే
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుుతుంది. సోమవారం అయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుుతుంది. సోమవారం అయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. తిరుమల కొండ గోవింద నామస్మరణలతో మారుమోగిపోతుంది. తిరుమలలో గత రెండు నెలకు పైగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. గతంలో ఎన్నడూ జులై నెలలో ఇంతటి రద్దీ లేదు. ఆపద మొక్కులు వాడికి మొక్కులు చెల్లించుకోవడం కోసం ఇతర ప్రాంతాల నుంచి పెద్దయెత్తున భక్తులు తరలి రావడంతో రద్దీ పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
రేపు ఎల్లుండి విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు...
జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం, జూలై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుందని అధికారులు తెలిపారు. రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దుచేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. జులై 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా ఇతరులకు టీటీడీ రద్దు చేసింది.జూలై 14, 15వ తేదిల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రత్యేక దర్శనం టిక్కెట్లు మాత్రం అనుమతిస్తారని చెప్పారు.
శిలాతోరణం వరకూ...
ఈరోజు తిరుమలలోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట శిలా తోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ఉదయం ఏడున్నర గంటలకు వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటలకుపైగానే పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 80,193 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33,298 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.43 కోట్ల రూపాయలు వచ్చింది.
Next Story

