Fri Dec 05 2025 15:12:10 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. ఈరోజు దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. నేడు గురువారమయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. నేడు గురువారమయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. అందులోనూ గురుపౌర్ణమి కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. తిరుమలకు వచ్చే భక్తులు ముందుగానే వసతి గృహాలను బుక్ చేసుకుని రావడం మంచి దని సూచిస్తున్నారు. కొందరు తిరుపతిలో గదులు అద్దెకు తీసుకుని తిరుమలకు దర్శనానికి వస్తున్నారు. తిరుమల మాత్రం భక్త జనం సంద్రంగా మారింది. ఏడు కొండలు గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. తిరుమలలో ఎక్కడ చూసినా భక్తుల రద్దీ కనిపిస్తుంది.
వీఐపీ దర్శనాలను రద్దు...
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది, ఈ నెల 15, 16 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజసం, ఆణివారం ఆస్థానం సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.మంగళవారం ఉదయం ఆరు గంటలకు తిరుమంజనం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి శ్రీవారి చెంతకు భక్తులను అనుమతిస్తారు. ఈ రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవని, దానికి అనుగుణంగా ఉండాలని టీటీడీ అధికారులు సూచించారు.
ఇరవై తొమ్మిది కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై తొమ్మిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు గంటల నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 76,501 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,033 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.39 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

