Sat Jul 19 2025 23:10:02 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం ఎంతగా ఉందో తెలిస్తే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గత నాలుగు రోజుల నుంచి తిరుమలలో భక్తులతో కిటకిటలాడిపోతుంది. గత రెండు నెలలుగా తిరుమలలో ఇదే పరిస్థితి నెలకొంది. వేసవి రద్దీ మొత్తం జూన్, జులై నెలల్లోనే కొనసాగుతున్నట్లు కనిపిస్తుంది. మొక్కులు తీర్చుకోవడానికి పాఠశాలలు తెరిచినప్పటికీ తిరుమలకు భక్తులు చేరుకుంటున్నారు. అయితే సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా సులువుగా దర్శనం అయ్యేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
బయట వరకూ క్యూ లైన్ లు...
ముందుగా బుక్ చేసుకున్న ప్రత్యేక దర్శనం టిక్కెట్లు పొందిన భక్తులతో పాటు కాలినడకన వచ్చే భక్తులు, ఎస్.ఎస్.డి టోకెన్లను తీసుకుని వచ్చే భక్తులు, శ్రీవాణి దర్శనం ద్వారా వచ్చే భక్తులు ఇలా తిరుమలలో రద్దీ కొనసాగుతుంది. తిరుమలలో వీధులన్నీ గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. ఎక్కడ చూసినా భక్తులు కనిపిస్తున్నారు. బయట వరకూ క్యూ లైన్ విస్తరించి ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
అన్ని కంపార్ట్ మెంట్లు నిండి...
ఈరోజు తిరుమలలోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 87,536 మంది భక్తులు దర్శించకున్నారు. వీరిలో 35,120 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.33 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story