Fri Dec 05 2025 10:27:23 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు వెళుతున్నారా? అయితే ఈ విషయంలో జాగ్రత్త
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. గత నెలరోజుల పై నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోతున్నాయి. బయట వరకూ క్యూ లైన్లలో భక్తులు వేచి ఉంటున్నారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. అయితే భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. సామాన్య భక్తులకు సత్వరం దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
నెలరోజులుగా...
భక్తులు గత నెల రోజులుగా అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటుండటంతో వీధులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. మాడ వీధులన్నీ గోవింద నామస్మరణలతో మారు మోగిపోతున్నాయి. ఇక ఎక్కడ చూసినా రద్దీయే కనిపిస్తుంది. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. చాలా సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. అదే సమయంలో అలిపిరి టోల్ గేట్ నుంచి మొదలయిన రద్దీ స్వామి వారి దర్శనం వరకూ కొనసాగుతుందని, పైన వాహనాల పార్కింగ్ కూడా కష్టంగా మారిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
పద్దెనిమిది గంటలు...
ఈరోజు తిరుమలలోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట ఏటీజీహెచ్ వరకూ క్యూ లైన్ విస్తరించింది. దాదాపు రెండు నుంచి మూడు కిలోమీటర్ల క్యూ లైన్ లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 90,815 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 35,007 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.52 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారుల తెలిపారు.
Next Story

