Fri Dec 05 2025 10:27:05 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో నేడు అన్ని కంపార్ట్ మెంట్లు ఫుల్లు.. స్వామి వారి దర్శనం కావాలంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. గత కొద్ది రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు పూర్తి కావస్తుండటంతో పాటు తిరిగి విద్యాసంస్థలు ప్రారంభం కానుండటంతో మొక్కులు చెల్లించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. అలిపిరి నుంచి భక్తుల సంఖ్య ఎంత ఉందన్నది మనకు అర్థమవుతుంది. అలిపిరి టోల్ గేట్ వద్దనే గంటల తరబడి వాహనాల తనిఖీల కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది.
కొనసాగుతున్న వేసవి రద్దీ...
అయితే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వేసవి రద్దీని ముందుగానే ఊహించిన టీటీడీ అధికారులు అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తీసుకున్నారు. తిరుమలలో ఎక్కడ చూసినా భక్త జన సందోహమే కనిపిస్తుంది. తిరుమల వీధులన్నీ గోవింద నామ స్మరణలతో మారుమోగిపోతున్నాయి. ఏడుకొండల వాడిని దర్శించుకుంటే అన్ని పాపాలు హరించిపోతాయన్న నమ్మకంతో తిరుమలకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది.
బయట వరకూ క్యూ లైన్...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 90,802 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 35,776 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.73 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

