Fri Dec 05 2025 14:03:46 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి వేచి ఉండే సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కూడా భక్తులు తిరుమలలో అధిక సంఖ్యలోనే ఉన్నారు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కూడా భక్తులు తిరుమలలో అధిక సంఖ్యలోనే ఉన్నారు. శ్రీవారి దర్శనానికి గంటల సమయం పడుతుంది. తిరుమలలో గత ఇరవై రోజుల నుంచి భక్తుల రద్దీ పెరుగుతుంది. సిఫార్సు లేఖలను అంగీకరించిన తర్వాత రోజు నుంచి భక్తుల రద్దీ ఎక్కువయింది. తిరుమలకు వచ్చేందుకు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తుండటంతో తిరుమల వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
లడ్డూల తయారీ...
వేసవి సెలవులు ముగియనుండటంతో భక్తుల రద్దీ మరికొద్దు రోజులు కొనసాగే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అభిప్రాయపడ్డారు. వేసవి రద్దీని తట్టుకునేలా టీటీడీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. నాణ్యమైన లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు అవసరమైన చర్యలను తీసుకుంది. అధునాతనమైన యంత్రాలను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోనుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన లడ్డూలను ప్రతిరోజూతయారు చేసేలా చర్యలు తీసుకుంటుంది. నెలకు కోటి లడ్డూలను విక్రయిస్తున్నారు. దర్శనానికి వచ్చిన భక్తుల సంఖ్య కంటే ఐదింతల లడ్డూలు అమ్ముడవుతున్నాయి.
పన్నెండు గంటలు...
ఈరోజు తిరుమలలోన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై తొమ్మిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 84,418 భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 34,900 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.89 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

