Fri Dec 05 2025 14:59:14 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో నేటి భక్తుల రద్దీ ఎలా ఉందో తెలుసా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తుల రద్దీ బుధవారం కూడా ఎక్కువగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తుల రద్దీ బుధవారం కూడా ఎక్కువగా ఉంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్లు నిండిపోయి బయట వరకూ నిల్చుని ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో పాటు వేసవి సెలవులు కూడా పూర్తి కావస్తుండటంతో భక్తుల అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.
పెళ్లిళ్ల సీజన్ కూడా...
పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో పెళ్లిళ్లు పూర్తయిన వెంటనే వధూవరులతో పాటు కుటుంబ సభ్యులు ఏడు కొండల వాడిని దర్శించుకునేందుకు ఎక్కువగా తరలి వస్తున్నారు. వేసవి రద్దీ ఎక్కువగా ఉంటుందని ముందే ఊహించిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా సులువుగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు రోజు వారీ ఎస్.ఎస్.డి టోకెన్లు జారీ చేయడంతో పాటు కాలినడకన వచ్చే భక్తులు, ప్రత్యేక దర్శనం భక్తులు కూడా అధికంగా వస్తున్నారు.
అన్ని కంపార్ట్ మెంట్లు..
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట ఏటీజీహెచ్ వరకూ భక్తులు క్యూ లైన్ లో విస్తరించి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 76,000 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,766 మంది తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.07 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

