Fri Dec 05 2025 12:36:49 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : సోమవారం తిరుమలలో భక్తుల రద్దీ ఎంత ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. సహజంగా సోమవారం భక్తుల రద్దీ అంతగా ఉండదు. అయితే పెళ్లిళ్ల సీజన్ కావడంతో రద్దీ పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. పెళ్లిళ్లు చేసుకున్న కొత్త జంటలు తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు బంధువులతో కలసి వస్తుండటంతో తిరుమలలో రద్దీ పెరిగింది. కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో కళకళలాడుతున్నాయి. తిరుమల వీధులు కూడా భక్తుల గోవింద నామస్మరణలతో మారు మోగిపోతున్నాయి.
పెళ్లిళ్ల సీజన్ కావడంతో...
సహజంగా పరీక్షలు ప్రారంభం కానుండటంతో ఈ నెలలో తక్కువగా రద్దీ ఉంటుందని అంచనా వేసినప్పటికీ పెళ్లిళ్లు, శుభకార్యాలు చేసుకున్న వారు ఏడుకొండల వాడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. వరస సెలవులు రావడంతో భక్తుల రద్దీ తిరుమలకు పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. మార్చి నెల చివరి నాటి నుంచి పరీక్షలు పూర్తి కానుండటంతో భక్తుల రద్దీ మరింత పెరిగే ఛాన్స్ ఉందని, అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.
పది కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 79,478 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,667 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.50 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

