Sat Dec 13 2025 22:35:00 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : శనివారం.. తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందో తెలుసా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమలకు భక్తుల తాకిడి ఇకపై ఎక్కువగా ఉంటుందని అంచనా వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. కార్తీక మాసం కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ప్రతి రోజూ వేలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటుండంటంతో వారికి వసతి సౌకర్యంతో పాటు స్వామి వారి దర్శనం కూడా సులువుగా లభ్యమయ్యే ఏర్పాట్లు చేస్తున్నారు.
అందరికీ దర్శనమయ్యేలా...
తిరుమలకు వచ్చే భక్తులు గతంలో మాదిరిగా కొన్ని రోజులను మాత్రమే ఎంచుకోవడం లేదు. ఎప్పుడు తమకు వీలుంటే అప్పుడు తిరుమలకు వచ్చి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. గత నాలుగు నెలల నుంచి పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో కొత్తగా పెళ్లయిన జంటలు, వారి బంధుమిత్రులతో కలసి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. తమిళనాడు నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారని, అందరికీ అవసరమైన ఏర్పాట్లతో పాటు లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం అందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ముప్ఫయి కంపార్ట్ మెంట్లలో
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్ఫయి కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటలకు పైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 68,075 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,535 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.80 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

