Fri Dec 05 2025 12:23:24 GMT+0000 (Coordinated Universal Time)
అనోన్యదాంపత్యానికి ఇదే కదా చిరునామా.. ప్రేమ బంధమూ.. ఎంత మధురమూ
కడప లో స్మశాన వాటికలో రిజర్వేషన్ బోర్డులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి

భార్యా భర్తల బంధం అనేది జన్మజన్మల అనుబంధం. ఒకరికి ఒకరు తోడుగా జీవితాంతం కలసి ఉండాలని భావిస్తారు. కలతలు వచ్చినా కలకాలం కలసి నడవాలని, ఇద్దరూ ఒక్కటిగా ఉండాలని తాపత్రయపడతారు. ఒకరి కోసం ఇంకొకరు త్యాగాలు చేసుకునేది ఒక భార్యాభర్తల్లోనే. ఒకరికి ఆరోగ్యం బాగా లేకపోతే మరొకరు చలించిపోతారు. ఇక అనేక సందర్భాల్లో భర్త హఠాన్మరణం చూసి తట్టుకోలేని భార్య కూడా మరణించింది. ఇటీవల తన భార్య చనిపోవడంతో యువకుడు చాదర్ ఘాట్ మూసినదిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మాంగల్యం తంతు నామేనే మమ జీవన హేతునాం అంటూ వేద మంత్రాల మధ్య ఒక్కటైన జంటలు జీవితాంతం కలసి ఉండాలని భావిస్తారు.
సమాధి పక్కనే...
ఒకరి ఆనందంలో మరొకరు, ఒకరి బాధల్లో మరొకరు పంచుకుంటారు. అలాగే తాజాగా కడప జిల్లాలో జరిగిన ఘటన మరొక చర్చకు దారితీసింది. భార్య కానీ భర్త కానీ ముందు చనిపోతే తర్వాత కూడా భర్త లేదా భార్య సమాధి పక్కనే తమ సమాధి కూడా ఉండాలని భావించేవారున్నారు. కడప జిల్లాలోని స్మశాన వాటికలో ముందుగానే భర్త సమాధి పక్కన భార్య తాను చనిపోతే ఇక్కడే సమాధి చేయాలని రిజ్వర్ చేసుకునేందుకు వీలుగా ఇక్కడ బోర్డులు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. స్మశాన వాటికలో రిజర్వేషన్ కూడా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చేమో కానీ, అన్యోన్యమైన దంపతులు మరణం తర్వాత కూడా పక్కపక్కన ఉండాలని కోరుకుంటూ ఇలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు.
బరియల్ గ్రౌండ్ లోనూ ...
సాధారణంగా రైళ్లు, బస్సులు, సినిమా హాళ్లలో రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.. మనం ముందుగా వాటిని రిజర్వేషన్ చేసుకుం టుంటాము. కానీ కడప రిమ్స్ సమీపంలోనే క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్స్ లో రిజర్వేషన్ బోర్డులు తాజాగా వెలిశాయి. ఇది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. తమ మరణానంతరం తమ వారి కోసం భర్త చనిపోతే భార్య , భార్య చనిపోతే భర్త కోసం ఇలా ముందుగా రిజర్వ్ చేసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.సోషల్ మీడియాలో కూడా ఇది వైరల్ గా మారింది. అందులో ప్రేమను చూడాలి తప్ప ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు మాత్రం అదీ అన్యోన్య దాంపత్యమంటే అని వ్యాఖ్యానిస్తున్నారు.
Next Story

