Fri Dec 05 2025 14:10:48 GMT+0000 (Coordinated Universal Time)
Anakapalli : అనకాపల్లి అదురుతుందయ్యా చంద్రం.. జర జాగ్రత్త
అనకాపల్లిలోనే అసలు కథంతా నడుస్తుంది. ఇక్కడ కూటమి పార్టీలకు చెందిన ముగ్గురు నేతల మధ్య పెద్దగా సఖ్యత లేనట్లు కనిపిస్తుంది

అనకాపల్లిలోనే అసలు కథంతా నడుస్తుంది. ఇక్కడ కూటమి పార్టీలకు చెందిన ముగ్గురు నేతల మధ్య పెద్దగా సఖ్యత లేనట్లు కనిపిస్తుంది. గత ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలసి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేశాయి. అయితే అనకాపల్లి విషయానికి వచ్చే సరికి శాసనభకు జనసేన నుంచి సీనియర్ నేత కొణతాల రామకృష్ణ పోటీ చేశారు. ఇక అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా బీజేపీకి చెందిన సీఎం రమేష్ ఉన్నారు. ఇక టీడీపీ నుంచి కూడా దాడి వీరభద్రరావు వంటి నేత ఉన్నారు. ముగ్గురి నేతల మధ్య మాత్రం సమన్వయం లేనట్లు కనిపిస్తుందంటున్నారు. పార్టీ క్యాడర్ విషయంలోనూ ఒకింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాన్న ఫిర్యాదులు మూడు పార్టీల కేంద్ర కార్యాలయాలకు అందుతున్నట్లు తెలిసింది.
ఎంపీగా ఉన్నప్పటికీ...
అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా సీఎం రమేష్ కడప నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసి కూటమికి వీచిన హవాతో గెలుపొందారు. ఆయన అనకాపల్లిలోనే పూర్తి స్థాయి రాజకీయాలు కేంద్రీకరించరు. ఆయన అనుచరులు అక్కడ పెత్తనం చేస్తున్నారని చెబుతున్నారు. సీఎం రమేష్ అప్పుడప్పుడు అనకాపల్లికి వస్తున్నప్పుడు మాత్రం అందరినీ కలుస్తూ ఆయన కూటమి పార్టీల నేతల మధ్య విభేదాలు లేకుండానే చేస్తున్నారు. కానీ ఆయన అనుచరులమని చెప్పుకునే కొందరు మాత్రం సీఎం రమేష్ పేరు చెప్పుకుని కొన్ని పనులు తీసుకోవడంతో పాటు సిఫార్సులు చేయడంలో ముందుండటంతో పాటు పదవుల విషయంలోనూ వారికే ప్రాధాన్యత దక్కుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పేరుకు ఎమ్మెల్యే అయినా...
ఇక సీనియర్ నేత కొణతాల రామకృష్ణ అనకాపల్లి నుంచి జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరి టిక్కెట్ తెచ్చుకోగలిగారు. తర్వాత ఆయనకు కేబినెట్ లో చోటు దక్కలేదు. కొణతాల రామకృష్ణ అనకాపల్లి ఎమ్మెల్యే అయినప్పటికీ ఉత్తరాంధ్ర సమస్యలపై గతంలో ఎక్కువ ఫోకస్ పెట్టేవారు. ఉత్తరాంధ్రకు సాగు, నీరు అందించే ప్రాజెక్టును తీసుకు రావాలని కొంతకాలం ఉద్యమాన్ని కూడా నిర్వహించిన కొణతాల ఆయన ఎక్కువగా ఆ ప్రాంత సమస్యలపైనే ఫోకస్ పెట్టారట. అయితే కొణతాల రామకృష్ణ ఎక్కువగా విశాఖపట్నంలో ఉండటంతో అనకాపల్లిలో ఆయన ప్రధాన అనుచరులు హవా కొనసాగిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
దాడిలో అసంతృప్తి...
అనేక పార్టీలు మారిన సీనియర్ నేత దాడి వీరభద్రరావు సయితం తనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎలాంటి పదవులు రాకపోవడంపై అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. అందుకు సీఎం రమేష్, కొణతాల రామకృష్ణ కారణమని ఆయన నమ్ముతున్నారు. సీఎం రమేష్ తో కాకపోయినా కొణతాల తో దాడి వీరభద్రరావు విభేదాలు ఈనాటివి కావు. దాడి వీరభద్రరావు బహిరంగంగానే కొణతాలపై విమర్శలు చేస్తుండటం, పార్టీ పదవులను కూడా టీడీపీ వారికి దక్కకుండా చేస్తున్నారని, చివరకు తమ కుటుంబాన్ని పక్కన పెట్టిన విషయంలోనూ కొణతాల ఉన్నారని దాడి వీరభద్రరావు అనుమానిస్తున్నారు. అందుకే మూడు పార్టీల నేతల మధ్య విభేదాలు అనకాపల్లిలో మూడు ముక్కలాటగాతయారైందంటున్నారు.
Next Story

