Fri Dec 05 2025 18:40:23 GMT+0000 (Coordinated Universal Time)
Rayapati : రాయపాటి ఇక రాం.. రాం.. అదొక్కటే ఆయనకు తృప్తి అట
రాయపాటి సాంబశివరావు గుంటూరు జిల్లాలో సీనియర్ నేత.

రాయపాటి సాంబశివరావు గుంటూరు జిల్లాలో సీనియర్ నేత. ఆయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నిన్న మొన్నటి వరకూ టీడీపీలో ఉన్నప్పటికీ పార్టీ నాయకత్వం మాత్రం ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదు. రాయపాటి సాంబశివరావు తనకు నరసరావుపేట కానీ, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం టిక్కెట్ ఇవ్వాలని కోరారు. తన కుమారుడు రంగారావు కు సత్తెనపల్లి టిక్కెట్ అడిగారు. కానీ ఆ కుటుంబానికి గత ఎన్నికల్లో ఏ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో వారు. టీడీపీ లో యాక్టివ్ గా లేరు. అలాగని మరొక పార్టీలో చేరిందీ లేదు. కాకపోతే తన రాజకీయ ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి టిక్కెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక పోతున్న రాయపాటి కుటుంబం మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఒకరకంగా స్వాంతన కలిగినప్పటికీ ఆ కుటుంబం పదిహేను నెలల నుంచి బయటకు రావడం లేదు.
చిన్నతనంలోనే...
2024 ఎన్నికల ముందు వరకూ గుంటూరు పాలిటిక్స్ ను శాసించిన రాయపాటి సాంబశివరావు తన వారసులను రాజకీయంగా ఎదిగేలా చూడాలని భావించారు. కానీ ఆయన కల నెరవేరేటట్లు కనిపించడం లేదు. టీడీపీ రాయపాటి కుటుంబాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. ఆయనను పట్టించుకోవడం లేదు. రాయపాటి సాంబశివరావు సీనియర్ నేత . 1982లోనే మొదటి సారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పుడు ఆయన వయసు కేవలం 39 సంవత్సరాలే. అతి చిన్న వయసులో పెద్దల సభలో అడుగుపెట్టిన రాయపాటి సాంబశివరావు ఇక వెనుదిరిగి చూసుకోలేదు. కాంగ్రెస్ లో ఆయన తిరుగులేని నేతగా దశాబ్దాల పాటు ఏలారనే చెప్పాలి. 1996, 1998, 2004, 2009 లో కాంగ్రెస్ పార్టీ తరుపున పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. 2014లో రాష్ట్ర విభజనతో ఆయన కాంగ్రెస్ ను వదిలి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. 2014లో ఆయన నరసరావుపేట పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. 2019లో ఆయన టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఎన్నికలకు ముందు...
టీడీపీలో క్రియాశీలకంగా మారదామనుకున్న రాయపాటికి అనారోగ్యం, వృద్ధాప్యం కొంత ఇబ్బందిగా మారింది. ఇక తాను రాజకీయాలు చేయలేని భావించి వారసులను తీసుకొచ్చేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు చేశారు. నరసరావుపేట పార్లమెంటు స్థానం కోరినా అక్కడి నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలను పోటీ చేయించడంతో రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు పార్టీకి రాజీనామా చేశారు. అయితే రాయపాటి కుటుంబం గుంటూరు జిల్లాలో ప్రాభవాన్ని కోల్పోయిందని చెప్పకతప్పదు. కొత్త తరం నేతలు రాజకీయాల్లోకి రావడంతో ప్రస్తుతానికి రాయపాటి కుటుంబ సభ్యులు కామ్ గానే ఉన్నారు. మరి ఎన్నికలకు ముందు ఏదైనా పార్టీలో చేరతారా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story

