Thu Dec 18 2025 09:58:04 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : సీమలో సైలెంట్ వేవ్ మొదలయిందా? ఫ్యాన్ కు అనుకూలంగా మారుతుందా?
రాయలసీమలో వైసీపీ క్రమంగా పుంజుకునట్లు కనిపిస్తుంది.

రాయలసీమలో వైసీపీ క్రమంగా పుంజుకునట్లు కనిపిస్తుంది. కూటమి పార్టీ నేతల్లో విభేదాలతో పాటు వైసీపీ పట్ల సానుకూలత ఒకరకంగా వైసీపీకి వచ్చే ఎన్నికల్లో కలసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. రాయలసీమలో మొత్తం యాభై రెండు శానససభ నియోజకవర్గాలున్నాయి. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుండటంతో పాటు పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో పాటు రాజధాని అమరావతికే తెచ్చిన రుణాలన్నీ పెడుతున్నారన్న ప్రచారం కూడా కూటమి పార్టీలకు ఇబ్బందికరంగా మారిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. గత ఎన్నికల్లో ఒక ఊపు ఊపిన కూటమి ఈసారి మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయని ఖచ్చితంగా చెప్పాలి. అందులోనూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం కూడా కూటమి పై ప్రతికూలత చూపుతుందని అంటున్నారు.
గత ఎన్నికల్లో...
గత ఎన్నికల్లో కర్నూలులో పథ్నాలుగు స్థానాలుంటే రెండు స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచింది. అది కూడా ఆలూరు, మంత్రాలయంలో మాత్రమే ఫ్యాన్ పార్టీ గలిచింది. ఆదోనిలో బీజేపీ, మిగిలిన పదకొండు నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించింది. అనంతపురం జిల్లాలో పథ్నాలుగు నియోజకవర్గాలుంటే కూటమి గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. ధర్మవరంలో మాత్రం బీజేపీ గెలిచింది. మిగిలిన పదమూడు చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. కడపలో పది నియోజకవర్గాలుంటే అందులో మూడింటిలో వైసీపీ మిగిలిన చోట్ల టీడీపీ, జనసేన, బీజేపీ గెలుచుకున్నాయి. వైసీపీ బద్వేలు, కడప, మైదుకూరుల్లో మాత్రమే గెలిచింది. ఇక చిత్తూరు జిల్లాలో పథ్నాలుగు నియోజకవర్గాలుంటే రెండింటిలో మాత్రమే వైసీపీ గెలిచింది. తంబళ్లపల్లి, పుంగనూరులో వైసీపీ గెలుపొందగా తిరుపతిలో జనసేన గెలిచింది.
వైసీపీ క్రమంగా పుంజుకుంటూ...
ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పరిస్థితులు మారాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక్కడ కూటమి నేతలు యాక్టివ్ గా లేకపోవడంతో పాటు వైసీపీ నేతలు క్రమంగా బలం పుంజుకుంటున్నట్లు కనపడుతుంది. ఇక వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత వైసీపీ మరింత బలపడే అవకాశాలున్నాయని అంటున్నారు. వేవ్ ఇప్పుడు సీమ జిల్లాల్లో మారిందన్నది నిఘా వర్గాలు కూడా ప్రభుత్వానికి అందించినట్లు సమాచారం. ప్రజల్లో అధికార పార్టీపై ఎప్పుడూ అసంతృప్తి ఉంటుంది. అది ప్రతిపక్ష పార్టీకి కొంత అనుకూలంగా మారుతుంది. మరొకవైపు జగన్ ను సీమ ప్రాంత వాసిగా చూడటంతో మరికొంత ప్లస్ అయిందని అంటున్నారు. మరి చివర వరకూ ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం రాయలసీమలో కూటమికి కష్టాలు.. వైసీపీకి వేవ్ మామూలుగా ఉండవన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.
Next Story

