Fri Dec 05 2025 12:37:30 GMT+0000 (Coordinated Universal Time)
BJP : పురంద్రీశ్వరి వచ్చే ఎన్నికల వరకూ వెయిట్ చేయాల్సిందేనట
రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు పురంద్రీశ్వరికి ఇప్పట్లో పదవి దక్కే అవకాశం కనిపించడం లేదు

రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు పురంద్రీశ్వరికి ఇప్పట్లో పదవి దక్కే అవకాశం కనిపించడం లేదు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఆమె కేంద్ర మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. కానీ నర్సాపురం పార్లమెంటు సభ్యుడు శ్రీనివాసవర్మను కేంద్ర మంత్రివర్గంలోకి అనూహ్యంగా తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీకి మాత్రం రెండు పదవులు లభించాయి. తెలంగాణలో ఎనిమిది స్థానాలను గెలవడంతో ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. ఏపీలో మూడు పార్లమెంటు స్థానాలు దక్కడంతో ఒకే ఒక్కరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరిగినప్పటికీ పురంద్రీశ్వరికి అవకాశం లభించదన్నది ఆమెకు తెలియంది కాదు.
కేంద్ర మంత్రి పదవి...
ఎందుకంటే టీడీపీ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న గుంటూరు పార్లమెంటుసభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ ప్రధాన కారణం. ఆయనను కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పించే ఛాన్సులు అయితే లేవు. ఎందుకంటే పెమ్మసాని లోకేశ్ కు, చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు. ఆయన అమెరికాలో ఆర్థికంగా స్థిరపడి కూడా తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీలో చేరారు. పెమ్మసాని కమ్మ సామాజికవర్గం కావడంతో ఇకపురంద్రీశ్వరికి ఆకోటాలో మంత్రివర్గంలో చోటు దక్కుతుందని రాజకీయాలు తెలిసిన వారు ఎవరూ అనుకోరు. ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరిని కేంద్ర కేబినెట్ లో ఒకే రాష్ట్రం నుంచి చేర్చుకునే అవకాశం లేదు. అందుకేపురంద్రీశ్వరికి భవిష్యత్ లోనూ కేంద్ర మంత్రి పదవి దక్కదు.
ఆ పదవి అయినా...
ఇక జాతీయ అధ్యక్ష పదవి అనికొన్నాళ్లు పురంద్రీశ్వరి పేరు వినిపించింది. అయితే నరేంద్ర మోదీ, అమిత్ షాలు ఆ పదవిని పురంద్రీశ్వరికి అప్పగిస్తామని అనుకోలేమని పార్టీ నేతలే చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు అనేక సార్లు బీజేపీతో కటీఫ్ చెప్పి బయటకు వెళ్లడం, చంద్రబాబుకు పురంద్రీశ్వరికి స్వయానా వదిన కావడంతో జాతీయ అధ్యక్ష పదవి కూడా దక్కుతుందని అనుకోలేం. అలాగే లోక్ సభలో కూడా అత్యున్నత పదవి లభిస్తుందని ఊహాగానాలు వినిపించినా అవి అంతవరకే పరిమితమవుతాయంటారు. మొత్తం మీద చిన్నమ్మకు ఈ టర్మ్ లో మాత్రం ఎటువంటి పదవులు.. ఇటు ప్రభుత్వంలో కానీ, అటు పార్టీలో కానీ దక్కే అవకాశాలు లేవన్నది పార్టీ నేతలే బహిరంగంగా అంటున్నారు. మరి పురంద్రీశ్వరికి పదవి దక్కాలంటే వచ్చే ఎన్నికల వరకూ ఆగాల్సిందేనంటున్నారు.
Next Story

