Fri Dec 05 2025 17:59:45 GMT+0000 (Coordinated Universal Time)
తెలుగు రాష్ట్రాలకు మరో మూడ్రోజులు వర్షసూచన
ప్రస్తుతం ఏపీలో దిగువ ట్రొపోస్పియర్ దక్షిణ, నైరుతి దిశల్లో చల్లటి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రానున్న మూడు..

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రెండ్రోజుల్లో అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు వాతావరణం అనుకుంగా ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే.. ఉత్తర-దక్షిణ ద్రోణి విదర్భ నుంచి ఉత్తర కేరళ వరకు మరఠ్వాడా అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తువరకూ వ్యాపించి ఉంది. దీనికి తోడు దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది.
ప్రస్తుతం ఏపీలో దిగువ ట్రొపోస్పియర్ దక్షిణ, నైరుతి దిశల్లో చల్లటి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రానున్న మూడురోజుల్లో ఉత్తరకోస్తా, ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు, ఈదురుగాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంది. అయితే ఈ వర్షాల కారణం పగటి ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండబోదని స్పష్టం చేశారు.
తెలంగాణలోనూ కొన్ని జిల్లాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదే సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఎల్లుండి మాత్రం వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు 41 నుండి 43 డిగ్రీల వరకూ నమోదు కావచ్చని పేర్కొంది.
Next Story

