Fri Dec 05 2025 18:03:43 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఏపీలో మూతపడిన విద్యాసంస్థలు
కేజీ నుంచి పీజీ వరకు ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం, డొనేషన్, కల్చరల్ యాక్టివిటీస్.. అంటూ రకరకాల ఫీజుల పేర్లతో ప్రైవేటు..

ఏపీ వ్యాప్తంగా నేడు విద్యాసంస్థలు మూతపడ్డాయి. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అడ్డగోలుగా దండుకుంటోన్న ఫీజుల దందాకు తెరదించేందుకు ఏబీవీపీ నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు పాఠశాలలకు సెలవు ప్రకటించాయి. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల దందాతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు పూర్తిస్థాయిలో టీచర్ల నియామకం చేపట్టాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది.
కేజీ నుంచి పీజీ వరకు ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం, డొనేషన్, కల్చరల్ యాక్టివిటీస్.. అంటూ రకరకాల ఫీజుల పేర్లతో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు తల్లిదండ్రులను వేధిస్తున్నాయని ఏబీవీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 1 పేపర్ల వరకే పరిమితమైందని, దానిని ఎవరూ పాటించడం లేదని తెలిపింది. ప్రైవేటు విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని తెలిసినా విద్యాశాఖ చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించింది. తమ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ఒకరిద్దరికి ర్యాంకులొస్తే.. పెద్దపెద్ద ప్రకటనలిస్తూ.. ప్రభుత్వ పాఠశాలలపై అపనమ్మకం కలిగేలా వ్యవహరిస్తున్నాయని మండిపడింది ఏబీవీపీ. గత నెలలో తెలంగాణలోనూ ఏబీవీపీ ఇదే విషయమై విద్యాసంస్థల బంద్ నిర్వహించింది.
Next Story

