Thu May 22 2025 07:14:40 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : ప్రధాని మోదీ ప్రకటన మామూలుగా ఉండదటగా.. అమరావతికి ఇక మంచి రోజులేనట
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారయింది. మే 2వ తేదీన ప్రధాని అమరావతి పర్యటనకు వస్తున్నారు

ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారయింది. మే 2వ తేదీన ప్రధాని అమరావతి పర్యటనకు వస్తున్నారు. రాజధాని పునర్మిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం కూడా అధికారికంగా ప్రకటిచింది. ప్రధాని సాయంత్రం నాలుగు గంటలకు అమరావతికి చేరుకుని దాదాపు రెండు గంటల పాటు అక్కడే ఉంటారు. అయితే ప్రధాని మోదీ ఈసారి కీలక ప్రకటనలు చేయనున్నారని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు గత ఐదేళ్లుగా రాజధాని లేకుండా పోయింది. అమరావతిలో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. 2014లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన తర్వాత వచ్చి నాలుగు మాటలు, మూట మట్టి ఇచ్చి, నీళ్లు ఇచ్చిపోయారన్న విమర్శలు అప్పట్లో బలంగానే వినిపించాయి.
పరిస్థితులు వేరుగా ఉండటంతో...
అయితే 2014 నాటి పరిస్థితులు... 2024 నాటి పరిస్థితులు రాజకీయంగా వేరుగా ఉన్నాయి. నాడు మోదీకి చంద్రబాబు అవసరం లేదు. నేడు మాత్రం మోదీకి చంద్రబాబు మద్దతు ఖచ్చితంగా ఉండాలి. అందుకే నాడు అమరావతి నిర్మాణానికి పెద్దగా నిధులు కానీ, ప్రకటనలు కానీ చేయకుండా వెళ్లిపోయారని అంటున్నారు. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయల రుణాన్ని అప్పుగా ఇవ్వడానికి కేంద్ర అనుమతి ఇచ్చింది. వరల్డ్ బ్యాంకు, ఆసియన్ డెవలెప్ మెంట్ బ్యాంకు నుంచి కలిపి పదిహేను వేల రూపాయలు, హడ్కో నుంచి మరో పదకొండు వేల కోట్ల రూపాయల రుణాలను తీసుకుని అమరావతి తొలి దశ పనులను వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నారు.
టెండర్లు కూడా...
నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు ఖరారయ్యాయి. మోదీ శంకుస్థాపన తర్వాత పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, మూడేళ్లలో పనులు పూర్తి చేసి అమరావతికి రూపు రేఖలు తీసుకు రావాలన్నలక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. ఈ సమయంలో రాష్ట్రానికి వస్తున్న నరేంద్ర మోదీ ఖచ్చితంగా మంచి సానుకూల ప్రకటన చేస్తారని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ సంస్థల ఏర్పాటుకు ఇప్పటికే అమరావతిలో భూములు కేటాయించారు. వాటి ఏర్పాటు కూడా సత్వరం పూర్తయ్యేలా ప్రధాని ప్రకటన ఉండే అవకాశముంటుందని చెబుతున్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత ఆర్థిక సాయాన్ని కూడా అందించే అవకాశాలను ఎవరూ కొట్టిపారేయలేకపోతున్నారు.
షెడ్యూల్ ఇదీ...
ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ ఖరారయింది. మే2న సాయంత్రం నాలుగు గంటలకు అమరావతి పునర్మిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. పదిహేను నిమిషాల పాటు రోడ్ షో ఉంటుంది. తర్వాత బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇందుకోసం సచివాలయం వెనక భారీ వేదికను సిద్ధం చేశారు. మూడు గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు హెలికాప్ట్ లో అమరావతికి చేరుకుంటారు. అనంతరం 1.1 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహిస్తారు. తర్వాత అమరావతి పెవిలియన్ ను సందర్శించి సాయంత్రం ఐదు గంటల వరకూ సభలో ప్రసంగించి తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళతారు.
Next Story