Mon Jun 23 2025 03:53:56 GMT+0000 (Coordinated Universal Time)
Purandhreswari : పురంద్రీశ్వరిపై వత్తిడి పెరుగుతుందా? పదవుల పంపిణీలో అన్యాయానికి కారణమెవరు?
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరిపై వత్తిడి పెరుగుతున్నట్లుంది.

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరిపై వత్తిడి పెరుగుతున్నట్లుంది. ఒకవైపు కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ బీజేపీ నేతలకు అన్యాయం చేస్తుందన్నది పార్టీలో అందరి నోటా వినిపిస్తున్న మాట. కేంద్ర నాయకత్వంపైనా, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబుపైన వత్తిడి తెచ్చి ఎక్కువ పదవులను రాబట్టుకునేలా ప్రయత్నించడంలో పురంద్రీశ్వరి విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పురంద్రీశ్వరి పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత మొన్నటి ఎన్నికల్లోనూ తక్కువ స్థానాలను పొత్తులో భాగంగా తీసుకున్నారని, అదే సమయంలో నామినేటెడ్ పదవుల విషయంలోనూ అన్యాయం చేస్తున్నా పెదవి విప్పడం లేదని కొందరు నేతలు అంటున్నారు.
ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే...
బీజేపీకి కేటాయించిన నాలుగైదు పోస్టుల్లోనూ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి బీజేపీలో చేరిన వాళ్లకు మాత్రమే నామినేటెడ్ పదవులు దక్కుతున్నాయని, బీజేపీలో తొలి నుంచి ఉన్నవారికి, పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న వారికి పదవులు ఇప్పించుకోవడంలో చిన్నమ్మ ఫెయిల్ అయ్యారని సొంత పార్టీ నేతలేఅంటున్నారు. సామాజికవర్గం కోణంలో కూడా పదవుల పంపిణీ బీజేపీకి కేటాయించిన విషయంలో జరగలేదని అంటున్నారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవుల విషయంలో కేంద్రపార్టీ నాయకత్వం తొలి నుంచి పార్టీలో ఉన్నవారికి పదవులు ఇస్తుంటే, నామినేటెడ్ పదవులు మాత్రం ఇతరపార్టీల నుంచి వచ్చిన వారికి ఇవ్వడమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తన ప్రమేయం ఏమీ లేదని...
పురంద్రీశ్వరి అయితే నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలోనూ తన ప్రమేయం ఏమీ లేదని చెబుతున్నారు. కేవలం కేంద్ర నాయకత్వం సూచనల మేరకే అన్ని పదవుల భర్తీ జరుగుతుందని చెబుతున్నారు. పురంద్రీశ్వరి రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ తన ప్రమేయం లేకుండానే నేరుగా టీడీపీ నాయకత్వం కేంద్రంలోని పెద్దలతో మాట్లాడి పదవులను భర్తీ చేస్తున్నారని అంటున్నారు. బీజేపీ నాయకులు మాత్రం తమకు పదవులు దక్కకపోవడానికి కారణం పురంద్రీశ్వరిమెతకవైఖరి అని చెబుతున్నారు. పట్టుబట్టే నైజం లేకపోవడం వల్లనే చాలా పదవులు తమకు రాకుండా కోల్పోవాల్సి వస్తుందని, ఇకనైనా త్వరలో బర్తీ కానున్న పోస్టుల్లో బీజేపీ నేతలకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని చిన్నమ్మపై వత్తిడి తెచ్చేందుకు కొందరు నేతలు సిద్ధమవుతున్నారు.
Next Story