గర్భిణిని 3 కిలోమీటర్లు మోసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చారు
దేశం ఎంతో అభివృద్ధి చెందుతోందని అనుకుంటూ ఉంటాం.

దేశం ఎంతో అభివృద్ధి చెందుతోందని అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని కొన్ని సార్లు ఇలాంటి ఘటనల గురించి తెలుసుకున్నప్పుడే ఇంకా ఎన్నో విషయాల్లో వెనుకబడే ఉన్నామని.. కనీస అవసరాలను తీర్చుకోవడం కోసం చాలా కష్టాలే పడుతున్నారని అవగతమవుతుంది!!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం టి.కొత్తగూడెం పంచాయతీ పరిధిలోని ఉమేశ్ చంద్ర నగర్లో గర్భిణి జానకికి పురిటి నొప్పులు రావడంతో భర్త సమ్మయ్య 108 అంబులెన్స్‌కు సమాచారం అందించాడు. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో 108 వాహనం మూడు కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయింది. దాంతో కుటుంబ సభ్యులు గర్భిణిని మోసుకెళ్లారు. అంబులెన్స్ లో మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆమె రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు వైద్యులు. వెంటనే జానకిని మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు తెలిపారు.

