Fri Dec 05 2025 11:59:37 GMT+0000 (Coordinated Universal Time)
Pulivendula : పంతం నీదా? నాదా? వైసీపీ, టీడీపీ ఎన్నికల పోరు
పులివెందులలో పొలిటికల్ హీట్ పెరిగింది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలుపు కోసం టీడీపీ, వైసీపీలు ప్రయత్నిస్తున్నాయి

పులివెందులలో పొలిటికల్ హీట్ పెరిగింది. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలో గెలుపు కోసం టీడీపీ, వైసీపీలు ప్రయత్నిస్తున్నాయి. జడ్పీటీసీ సభ్యుడి ఆకస్మిక మరణంతో పులివెందులలో ఉపఎన్నిక జరగనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన తెలుగుదేశం పార్టీ వైసీపీలు నామినేషన్లు దాఖలు చేశాయి. ఒక్కొక్క పార్టీ నుంచి రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 5వ తేదీ లోపు బీఫారాలు అభ్యర్థులకు పార్టీ అధినాయకత్వాలు అందచేయాల్సి ఉంది. ఆరో తేదీ నుంచి పార్టీలు ఎన్నికల ప్రచారం చేయడానికి వీలుంటుంది. ఈ నెల 12వ తేదీన ఎన్నిక జరగనుంది. అయితే రెండు పార్టీలు ముఖాముఖి తలపడుతుండంతో పోటీ ఆసక్తికరంగా మారింది.
రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించి...
వైసీపీ పులివెందుల జడ్పీటీసీ టిక్కెట్ ను మహేశ్వర్ రెడ్డి కుటుంబానికి ప్రకటించింది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్ ఇలాకా కావడంతో పాటు సొంత నియోజకవర్గం అవ్వడంతో ఈ ఎన్నిక రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఖచ్చితంగా తమ అభ్యర్థి గెలుస్తారని వైసీపీ ధీమాగా ఉంది. జగన్ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండాలంటే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ గెలవాల్సి ఉంటుంది. అందుకే వైసీపీ నేతలు శక్తికి మించి పోరాడుతున్నారు. ప్రతిపక్షంలో ఉండి తమ స్థానాన్ని తాము నిలబెట్టుకునేందుకు వైసీపీ తీవ్రంగా శ్రమిస్తుంది. జగన్ నేరుగా ప్రచారం పాల్గొనకపోయినా నాయకులను ఎప్పటికప్పుడు బెంగళూరు నుంచి అప్రమత్తం చేస్తున్నారు.
మానసికంగా ఒత్తిడి తేవాలని...
మరొక వైపు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో గెలిచి జగన్ పై మానసికంగా వత్తిడి తేవాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది. గతంలో కుప్పం నియోకవర్గంలో తమ పార్టీని ఓడించి సంబరాలు చేసుకున్నట్లుగానే ఈసారి పులివెందులలో తమ సత్తా చూపాలని పసుపు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. దీంతో అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతా రెడ్డిని పోటీకి దించింది. లతారెడ్డితోపాటు బీటెక్ రవి తమ్ముడు జయభరత్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. జడ్పీటీసీ ఎన్నికను సవాలుగా వైసీపీ నేత సతీష్ రెడ్డి తీసుకున్నారు. బీటెక్ రవి గెలిచి తీరాలని తీవ్ర ప్రయత్నమే చేస్తున్నారు. దీంతో పులివెందులలో రాజకీయం వేడెక్కింది.
ఆధిపత్యం సాధించేందుకు...
పులివెందులలో పార్టీకున్న పట్టుతో పాటు వైసీపీ సెంటిమెంట్ అస్త్రాన్ని ఉపయోగిస్తుంది. జడ్పీటీసీ మరణించినా పోటీకి దింపడంతో పాటు వారి కుటుంబానికే సీటు ఇవ్వడంతో జనం సెంటిమెంట్ కు పడిపోతారని వైసీపీ ఆలోచిస్తుంది. అధికారంలో ఉండటంతో తమకు అడ్వాంటేజీగా అవుతుందని భావిస్తున్నారు. అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తుంది. ఎలాగైనా గెలిచి తీరాలని భావిస్తుంది. జగన్ పై ఆధిపత్యాన్ని తెచ్చుకోవాలన్నా, ఏపీ ప్రభుత్వంపై జగన్ చేసే విమర్శలకు చెక్ పెట్టాలనుకున్నా ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన విషయం. అందుకే ఈ ఎన్నికల్లో టీడీపీ పై చేయి సాధించి జగన్ పై కక్ష తీర్చుకోవాలనుకుంటుంది. దీంతో వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఏం జరుగుతుందని రాష్ట్రం మొత్తం ఆసక్తిగా చూస్తుంది.
Next Story

