Thu Mar 19 2026 01:05:08 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : అంబటితో ఎంత తప్పిదమో.. టీడీపీ కూడా అదే తప్పు చేసినట్లే
మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు గరంగరం గా మారింది. మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరిసిస్తూ టీడీపీ నేతలు పెద్దయెత్తున ఆందోళనకు దిగారు. టీడీపీ కార్యకర్తలు రాంబాబు నివాసం, కార్యాలయంలపై దాడులు చేశారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. పోలీసులు నిలువరించినా సాధ్యం కాలేదు. రాంబాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందేనంటూ పూలకుండీలు, నాపరాళ్లు, కర్రలతో ఆయన ఇంటిపై దాడికి దిగారు. వాహనాలను ధ్వంసం చేశారు. కార్యాలయంలోకి చొరబడి టీవీలను కూడా పగల కొట్టారు. పోలీసులు మాత్రం చోద్యం చూసినట్లు వ్యవహరించారు.
ఫ్లెక్సీ వివాదంలో...
తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై టీడీపీ వేసిన ఫ్లెక్సీలు ఈ వివాదానికి కారణమయ్యాయి. తిరుమలలో కల్తీ నెయ్యితోనే లడ్డూ తయారైందంటూ టీడీపీ నేతలు ఫ్లెక్సీలు తయారు చేశారు. వాటిని తొలగించాలంటూ అంబటి రాంబాబు అక్కడకు వెళ్లడంతో టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతోఅంబటి రాంబాబు నోరు జారారు. కొన్ని అసభ్యకరమైన పదాలు ఆయన నోటి నుంచి రావడంతో పాటు టీడీపీ శ్రేణులు ధ్వంసానికి దిగాయి. అర్ధరాత్రి అంబటి రాంబాబను పోలీసులు అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంబటి రాంబాబును బయటకు తీసుకు వచ్చేంత వరకూ తాము కదలబోమని అక్కడే భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు.
రెండు పార్టీలదీ...
ఇటు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు కూడా జగుప్సాకరంగా ఉన్నాయి. అలాగే టీడీపీ శ్రేణులు వ్యవహరించిన తీరు కూడా ఆక్షేపణీయంగానే ఉంది. అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఆయన ఇల్లు, కార్యాలయంపై దాడికి దిగి బీభత్సం సృష్టించి టీడీపీలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. నిజానికి రెండు పార్టీల నుంచి తప్పులు కనపడుతున్నాయి. కార్యకర్తలను అదుపు చేయాల్సిన నేతలు రెచ్చగొట్టేవిధంగా మాట్లాడటమే ఈ విధ్వంసానికి కారణమని చెప్పకతప్పదు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కూడా తాము చేసిన తప్పును సమర్థించుకోవడం చూస్తే ఏపీ రాజకీయాలు ఎటు వైపు వెళుతున్నాయన్నది అర్ధమవుతుంది.
Next Story

