Fri Dec 05 2025 13:37:46 GMT+0000 (Coordinated Universal Time)
Banakacharla : బనకచర్ల పై ఏం జరుగుతుందో.. వాటర్ వార్ పై ఎవరిది పై చేయి?
పోలవరం - బనకచర్ల ప్రాజెక్టు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. గోదావరి నది నుంచి వరద జలాలు సముద్రంలోకి వృధాగా పోయే నీటిని మాత్రమే తాము వినియోగించుకుంటామని, దిగువన ఉన్న తాము అదనపు నీళ్లను వాడుకోలేం కదా? అని ఏపీ ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. ఈ బనకచర్ల ప్రాజెక్టు కారణంగా రాయలసీమకు సాగునీరు, తాగునీరు అందించవచ్చని, తద్వారా వెనకబడిన రాయలసీమ ప్రాంతం సుభిక్షంగా మారుతుందని, ఇందుకు ఎనభై వేల కోట్ల రూపాయల అంచనా వ్యయం అవుతుందని చెప్పింది.
ప్రాజెక్టుపైనే ప్రధానంగా...
అయితే పోలవరం బనకచర్ల ప్రాజెక్టు కు సబంధించి పర్యావరణ అనుమతులు తీసుకోవాలని కేంద్ర జల సంఘం తేల్చి చెప్పింది. మరొకవైపు పోలవరం అధారిటీ కూడా కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ప్రధానంగా బనకచర్ల ప్రాజెక్టుపైనే ఆయన చర్చించడానికి వెళుతున్నారు. రెండు రోజుల చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను కూడా కలసి బనకచర్ల ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు లభించేలా సహకరించాలని కోరనున్నారు. ఈ ప్రాజెక్టు గేమ్ ఛేంజర్ గా పదే పదే చెబుతున్న చంద్రబాబు ఢిల్లీ పెద్దలపై వత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
రేపు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో...
నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. జలవివాదాలపై చర్చ కోసం రేపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో పాటు అధికారులు కూడా సమావేశమవుతారు. ఇరువురు ముఖ్యమంత్రలతో బనకచర్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని, తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉన్న అభ్యంతరాలను వింటారు. రేపు మధ్యాహ్నం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి నేతృత్వంలో తెలుగు రాష్ట్రాలముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలు భేటీ అవుతారు. సమావేశానికి ఇద్దరు సీఎంలను పిలుస్తూ కేంద్ర జలశక్తి సర్క్యూలర్ జారీ చేసింది. అయితే ఏ పీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
నో చెప్పిన తెలంగాణ...
బనకచర్ల ప్రాజెక్ట్ పై చర్చించడానికి విముఖత వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వంలేఖ రాసింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బనకచర్ల పై సమావేశానికి రేపు ఢిల్లీలో ఏర్పాట్లు చేసిన కేంద్రం ప్రభుత్వానికి లేఖతో సమాధానమిచ్చింది. బనకచర్లపై సింగిల్ ఎజెండా తో సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. అయితే చర్చ అవసరం లేదంటూ ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. రెండు రోజులుగా ముఖ్యమంత్రుల సమావేశంపై తెలంగాణ లో జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో లేనిపోని అనుమానాలకు తావివ్వడం ఇష్టం లేకనే తెలంగాణ ప్రభుత్వం చర్చకు నో చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద బనకచర్ల ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలకు ప్రధాన అంశం కాగా, కేంద్ర ప్రభుత్వానికి మాత్రం తలనొప్పిగా తయారయిందనే చెప్పాలి.
Next Story

