ఏపీ, తెలంగాణ విభజనపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఏపీ, తెలంగాణ విభజన సరిగా జరగలేదని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
ఏపీ, తెలంగాణ విభజన సరిగా జరగలేదని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల ఏర్పాటు వల్ల రెండు రాష్ట్రాల్లో సంబరాలు జరగలేదన్నారు. సోమవారం నాడు సమావేశాలు పార్లమెంట్ పాత భవనంలో జరుగుతుండగా, మంగళవారం నుంచి నూతన పార్లమెంట్ భవనంలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. పార్లమెంటు 75 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ లోక్ సభలో ప్రసంగిస్తూ ఏపీ, తెలంగాణ విభజనపై మాట్లాడారు. యూపీఏ హయాంలో ఈ పార్లమెంట్ లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని.. అయితే ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మాదిరిగా ఏపీ, తెలంగాణ విభజన జరగలేదని తెలిపారు. వాజ్పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు మూడు రాష్ట్రాల విభజన ఎంతో ప్రణాళికాబద్ధంగా చేశారని అన్నారు. ఆ మూడు రాష్ట్రాల విభజన సమయంలో అన్ని చోట్లా సంబరాలు జరిగాయన్నారు. ఏపీ, తెలంగాణ విభజన సమయంలో ఎక్కడా సంబరాలు జరగలేదన్నారు. ఈ విభజన రెండు తెలుగు రాష్ట్రాలను సంతృప్తి పర్చలేకపోయిందన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఎంతో మంది బలిదానాలు చేసుకున్నారన్నారు. అయినా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సంబరాలు చేసుకోలేకపోయిందన్నారు.