Sat Mar 14 2026 16:01:47 GMT+0530 (India Standard Time)
Pithapuram : పిఠాపురంలో టీడీపీ vs జనసేన ఫైట్ కు ఫుల్ స్టాప్ పడేట్లు లేదే?
పిఠాపురం వర్మకు మళ్లీ కోపం వచ్చింది.

పిఠాపురం వర్మకు మళ్లీ కోపం వచ్చింది. పారిశుద్ధ్య కార్మికుల శిక్షణ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో చిన్నదిగా పెట్టడంతో వర్మ స్థానిక టీడీపీ కౌన్సిలర్లపై సీరియస్ అయ్యారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో చిన్నది పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన వర్మ అక్కడ ఉండకుండా వెళ్లిపోయారు. అక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటో పెద్దదిగా పెట్టి, చంద్రబాబు ఫొటో చిన్నదిగా పెట్టడమేంటని అధికారులతో పాటు టీడీపీ కౌన్సిలర్లను కూడా వర్మ నిలదీశారు. ఇదేనా ముఖ్యమంత్రికి ఇచ్చే గౌరవం అంటూ ప్రశ్నించారు.
గత కొంతకాలంగా...
దీని వెనక ఎవరు ఉన్నారో తనకు తెలుసునని, కూటమిలో ఉన్నపార్టీనేతలను ఒకరినొకరు గౌరవించుకుంటే అందరికీ మంచిదని వర్మ వ్యాఖ్యానించారు కూడా. ముఖ్యమంత్రి చంద్రబాబుకే అవమానం జరిగినప్పుడు తాను ఈ సమావేశంలో ఎలా పాల్గొంటానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ఎన్ వర్మ గత కొంతకాలంగా అసంతృప్తితోనే ఉన్నారు. ఎన్నికలకు ముందు తనకు నాయకత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్న అక్కసును వర్మ అవసరమైన ప్రతిసమయంలో వెళ్లగక్కుతూనే ఉన్నారు. వర్మకు పదవి దక్కకుండా ఎవరు అడ్డుపడుతున్నారో తనకు తెలుసునని వర్మ అనుచరులు బహిరంగంగానే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
పవన్ వచ్చినప్పుడు మాత్రం...
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం వచ్చినప్పుడు తనకు దక్కుతున్న గౌరవం ఆయన లేనప్పుడు మాత్రం దొరకడం లేదు. పిఠాపురం జనసేన నేతలకు, టీడీపీ నేతలకు మధ్య బాగా గ్యాప్ పెరిగింది. పదవి దక్కక పోవడం ఒకటి, తనను పట్టించుకోక పోవడం మరొకటి.. ఇక పిఠాపురంలో తాను పోటీ చేయలేమోననే ఆవేదన వర్మలో అడుగడుగునా కనిపిస్తుంది. అయితే అన్నీ అణిచిపెట్టుకుని సంయమనంతో వ్యవహరిస్తున్నారు. పార్టీ నాయకత్వం ఎప్పటికైనా తనను గుర్తించి అక్కును చేర్చుకుంటుందన్న ఆశతో వర్మ ఉన్నారు. అప్పటి వరకూ పిఠాపురంలో వర్మ వర్సెస్ జనసేన వార్ కు ఫుల్ స్టాప్ ఉండదట. సశేషమేనట.
Next Story

