Sat Dec 13 2025 22:33:48 GMT+0000 (Coordinated Universal Time)
Maoists : షెల్టర్ జోన్ గా బెజవాడే ఎందుకు?? మావోయిస్టుల ప్లాన్ ఏంటి?
విజయవాడ నగరాన్ని మావోయిస్టులు షెల్టర్ జోన్ గా ఎంచుకోవడం చర్చనీయాంశమైంది

విజయవాడ నగరాన్ని మావోయిస్టులు షెల్టర్ జోన్ గా ఎంచుకోవడం చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ కు నడిబొడ్డున ఉండే విజయవాడ నగరం తమకు సేఫ్ జోన్ గా మావోయిస్టులు ఎందుకు భావించారన్నది ఇప్పుడు పోలీసు వర్గాల్లోనూ చర్చ జరుగుతుంది. పెనమలూరులో ఒక భవనంలో ఉంటున్న దాదాపు ఇరవై ఏడు మంది మావోయిస్టులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో సహజంగా ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరంతా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా అనుచరులుగా భావిస్తున్నారు. పట్టుబడిన వారిలో ఎక్కువ మంది ఛత్తీస్ గఢ్ కు చెందిన వారున్నారు. మారేడుమిల్లిలో జరిగిన ఎన్ కౌంటర్ వద్ద లభించిన డైరీ ఆధారంగా ఇక్కడ మావోయిస్టులున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.
ఛత్తీస్ గఢ్ నుంచి వచ్చిన వారే...
కేంద్ర భద్రతా బలగాలు మంగళవారం పెనమలూరు ప్రాంతంలో విస్తృత తనిఖీలు నిర్వహించి, మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధం ఉన్నారని అనుమానంతో 27మందిని అదుపులోకి తీసుకున్నాయి. ప్రాథమిక వివరాల ప్రకారం, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన కొంత మంది మావోయిస్టులు న్యూ ఆటోనగర్లో తలదాచుకున్నారన్న సమాచారంతో బలగాలు ఆ ప్రాంతంలో దర్యాప్తు ప్రారంభించాయి. పలు ఇళ్లలో ఇంటింటిని గాలించగా ఒక ఇంట్లో మావోయిస్టులు ఉండటంతో ఆక్టోపస్ బలాగాలతో పాటు పోలీసులు భవనాన్ని చుట్టుముట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారు పదిహేను రోజుల క్రితం ఈ భవనంలోకి అద్దెకు వచ్చినట్లు తెలిసింది. వారంతా కూలీపనుల కోసం వచ్చినట్లు ఇంటి యజమానికి చెప్పినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
రాజధాని పనులు జరుగుతుండటంతో...
భవన యజమాని అప్పలస్వామి విశాఖలో ఉంటున్నారు. ఆయనను కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే రాజధాని అమరావతి పనులు జరుగుతుండటంతో పాటు న్యూ ఆటోనగర్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తుండటంతో ఇది తమకు షెల్టర్ జోన్ గా భావించి ఉంటారని అనుమానిస్తున్నారు. అంతే కాకుండా ఇక్కడి నుంచి తర్వాత సులువుగా తిరిగి అడవుల్లోకి చేరుకోవచ్చని కూడా మావోయిస్టులు భావించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇక్కడ అన్నీ పరిశ్రమలే ఉండటంతో ఎవరికీ అనుమానం రాదని, అదేసమయంలో తమ భాషపై కూడా ఎవరికీ అనుమానం రాదని భావించి న్యూ ఆటోనగర్ ను మావోయిస్టులు ఎంచుకున్నారని తెలిసింది.
ఎందుకు బెజవాడ వచ్చారు?
తిరిగి హిడ్మా ఆదేశాలు అందిన వెంటనే అడవుల్లోకివెళ్లిపోవాలనుకన్నారా? లేక మరేదైనా ఆపరేషన్ కు ఇక్కడకు వచ్చారా? అన్న అనుమానంపై పోలీసులు వీరినివిచారిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో మావోయిస్టులను ఏరివేస్తున్న క్రమంలో వారు ఆంధ్రప్రదేశ్ తమకు సురక్షితమైనదిగా భావించి ఇక్కడకు చేరుకున్నారని తెలిసింది. ఇక్కడ కొన్ని రోజులు ఉండి తిరిగి తమ ప్రాంతానికి వెళ్లిపోవాలన్నది వారి ప్లాన్ అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే మారేడుమిల్లిలో జరిగిన ఎన్ కౌంటర్ లో హిడ్మా డైరీలో విషయం బయటపడటం వల్లనే వీరంతా పోలీసులకు సులువుగా దొరికపోయారని, లేకుంటే వీరి ఆచూకీ కనిపెట్టడం సాధ్యం కాకపోవచ్చన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఏలూరులో పన్నెండు మంది, కాకినాడ జిల్లా కొప్పవరంలో ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మావోయిస్టులున్నారని పోలీసులు అలెర్ట్ అయ్యారు. గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story

