Sat Jan 03 2026 18:41:53 GMT+0000 (Coordinated Universal Time)
Payyavula Kesav : పయ్యావుల పెదవి విప్పరా... ప్రెషర్ లో ఉన్నట్లుందిగా..?
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేరు

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేరు. ఆయనకు ఆర్థిక శాఖ అప్పగించడంతో పెద్దగా బయట కనపించడం లేదు. అలాగే విపక్షాల విమర్శలపై కూడా పయ్యావుల కేశవ్ పెద్దగా స్పందించడం లేదు. తన పని తాను చేసుకుపోతున్నారు. ప్రతి నెల మొదటి తారీఖు వచ్చే సరికి రుణాలు తీసుకు వచ్చే బాధ్యతతో పాటు అనేక రకాలమైన వత్తిళ్లతో ఆయన కొంత పాలనాపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. అందుకే పయ్యావుల కేశవ్ పెద్దగా గతంలో మాదిరిగా యాక్టివ్ గా లేరని అంటున్నారు. పయ్యావుల తాను చూసే శాఖకు తాను తగిన న్యాయం చేయలేకపోతున్నానన్న ఆవేదనను కూడా సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
సీనియర్ లీడర్ గా...
పయ్యావుల కేశవ్ తెలుగుదేశం పార్టీలో ఓ సీనియర్ లీడర్. దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలోను పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అయితే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఓడిపోతుంటే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన విజయాలు సాధిస్తూ వస్తున్నారు. పయ్యావుల పార్టీ ప్రతిపక్షంలో ఉన్న 2004, 2009 ఎన్నికల్లో మాత్రం విజయం సాధించారు ఆయన 1999, 2014లో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఓడిపోయారు. 2014లో ఓడిపోయినా ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు పయ్యావుల కేశవ్ గొంతు బలంగా వినిపించేది. ఆయన పీఏసీ ఛైర్మన్ గా ఉండి కూడా 2019 లో తన గళాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినిపించడంలో ఎక్కడా తగ్గలేదు. 2024 లో ఆయన గెలిచి.. పార్టీ గెలవడంతో చంద్రబాబు నాయుడు కీలకమైన ఆర్థిక శాఖను పయ్యావుల కేశవ్ కు అప్పగించారు.
నెలాఖరయ్యే సరికి...
పయ్యావుల కేశవ్ కు పద్దుల టెన్షన్ ఎక్కువగా ఉంది. ఈసారి చంద్రబాబు నాయుడు సంక్షేమం, అభివృద్ధి సమానంగా తీసుకెళుతున్నారు. దీంతో రెండింటికీ నిధుల సర్దుబాటుకే సమయం సరిపోతుంది. ఎక్కువ సార్లు పయ్యావుల కేశవ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులతో పాటు రుణాలకు సంబంధించిన అనుమతులు కూడా పొందాల్సి ఉంటుంది. ఒకవైపు చంద్రబాబు, లోకేశ్ లు ఢిల్లీ వెళ్లి నిధుల కోసం తిరుగుతున్నా, పయ్యావుల కేశవ్ పై ఆర్థిక మంత్రిగా బాధ్యత ఉండటంతో ఆయన ఎక్కువ టెన్షన్ పడుతున్నట్లు తెలిసింది. పయ్యావుల అధికారంలో ఉన్నప్పుడు కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే యాక్టివ్ గా ఉన్నారన్నది పార్టీ నేతలు సయితం అంగీకరిస్తున్న విషయం. పయ్యావుల పద్దుల టెన్షన్ ఈ టెర్మ్ అంతా కొనసాగే అవకాశముంది. అందుకే చంద్రబాబు కూడా పయ్యావుల విషయంలో చూసీచూడనట్లు వదిలేస్తున్నారని వినికిడి.
Next Story

